మహా దేవుడు ఆది దేవుడు అయిన శివుడు. లోక కంఠకులను అంతం చేసి అదుపులో పెట్టే ఈశ్వరుడు. ప్రళయాన్ని గరళం గా చేసి కంఠం లో బంధించిన నీల కంటుడు. అలాంటి శివుడి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నువ్వే శరణు అని వేడుకుంటే యముడిని సైతం ఎదిరించి కాపాడే భోళా నాధుడు. అలాంటి మహాదేవుడి ఆలయాలు అద్భుతాలను ఆశ్చర్యాలను కలిపి మనకు ముక్తి మార్గాన్ని చూపిస్తాయి. అలాంటి ఒక అద్భుత ఆలయమే స్తంభేశ్వర్ మహాదేవ్ మందిర్.

ఇది గుజరాత్ రాష్ట్రం లో బారోష్ జిల్లా లో కవి గ్రామానికి దగ్గర లో ఉంది. ఇక ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే…… రోజు ఉదయం మాయం అయి తిరిగి కొన్ని గంటలకి ప్రత్యక్షం అవుతుంది. అవును ఈ గుడి మాయం అవుతుంది అది ఎలా అంటే ఈ గుడి సముద్రానికి దగ్గర గా ఉంది. ఉదయ సమయం లో గుడి లో ఉన్న లింగాన్ని ఒక అల కొంత వరకు ముంచి రెండవ అల రాగానే పూర్తిగా మునిగిపోతుంది. అలా కొంత సేపు ఐన తర్వాత మళ్ళీ అలలు తిరిగి నీటిని వెనుకకు తీసుకుపోతాయి. అంటే ఉదయం నీటి లో మునిగి తిరిగి బయట కి వస్తుంది ఈ గుడి. ఈ గుడి అరేబియా సాగరానికి దగ్గరలో ఉంది. ఈ గుడిలో ఉన్న శివలింగం నాలుగు అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడ స్వయం గా శివుడే ఉన్నాడని అందుకే సాగరుడు ప్రతి రోజు పరమ శివుడిని అభిషేకించడానికి వచ్చి సముద్ర నీటితో అభిషేకించి తిరిగి వెళ్ళిపోతున్నాడని భక్తుల నమ్మకం.

ఇక ఇక్కడ స్థల పురాణాన్ని చూస్తే పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం అవగానే, కోరికగా నీకు జన్మించే బిడ్డ వల్లనే నాకు మరణం కావాలని కోరాడు.. దానికి శివుడు సరే అని అదే వరాన్ని తరకాసురుడికి ఇచ్చాడు. ఇక ఆ మాట విని తారకాసురుడు ముల్లోకాలని హింసించడం మొదలుపెట్టాడు. ఇక నీవే శరణం అని అందరు దేవతలు శివుడిని వేడుకున్నారు. అది విని శివుడు పార్వతి కలిసి కుమారన్ స్వామికి జన్మనిచ్చారు. కృతిక ద్వారా సంరక్షించబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. కార్తికేయుడు కి ఆరు తలలు ఉంటాయి. ఆలా కార్తికేయుడు ఉద్భవించి తరకాసురుడిని హతమార్చాడు.

కానీ తారకాసురుడు గొప్ప శివ భక్తుడు అని తెలిసి అంతటి శివ భక్తుడున్నీ చంపినందుకు తన లో తాను మదనపడసాగాడు. తప్పు చేసానేమో అని ఆలోచించసాగాడు. అయితే దుష్టులని శిక్షించడం తప్పు కాదు అని శివుడు చెప్పిన అతని మనసు కుదుట పడలేదు. చివరికి విష్ణువు వచ్చి కార్తికేయుడి తో నీవు ఒక శివ లింగాన్ని ప్రతిష్టించమని అపుడు నీ మనసు కుదుటపడుతుంది అని తెలిపాడు. కార్తికేయుడు వెంటనే ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించి పూజించి తన మనసు నుండి అశాంతిని తొలగించుకున్నాడు. ఆలా కార్తికేయుడి ద్వారా ప్రతిష్టించబడ్డ శివలింగము ఈ స్తంభేశ్వర్ మహాదేవ్ శివ లింగం. ఇక్కడ అమావాస్య కు శివరాత్రి కి విశిష్ట పూజలు జరుగుతాయి. వేళా మంది ఈ మందిరాన్ని సందర్శించి భక్తి ప్రపత్తులు చాటుకుంటారు.. ఇదండీ స్తంభేశ్వర్ మహాదేవ్ మందిర్ విశిష్టత.

