భక్తులు నిండు మనసుతో పూజిస్తే విఘ్నాలు లేకుండా అనుగ్రహించే దేవుడు వినాయకుడు. విగ్నేశ్వరుడు- దీనదయాళుడు. సాధారణంగా దేవాలయాలు భూమిపై ఉంటే ఇక్కడ స్వామి కొండపై ఉండటం విశేషం. ఈ ఆలయం తమిళనాడులోని, తిరుచ్చిలో రాక్ ఫోర్ట్ పై స్వయంబుగా వెలిసాడు. ఈ ఆలయంకొండపై 83 అడుగుల ఎత్తులో ఉంది.

స్థల పురాణం: రామాయణంలో రావణుడు సీతను బంధిస్తాడు. దీనిని వ్యతిరేకించిన రావణుడి సోదరుడు, విభీషణుడు తన సోదరుడికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో రాముడికి సహాయం చేస్తాడు. ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాముడు, రావణుని సంహరించి చివరికి సీతను పొందుతాడు. విభీషణుడు చేసిన సహాయానికి చిహ్నంగా రాముడు, విష్ణువు యొక్క రూపమైన రంగనాథుని విగ్రహాన్ని ఇస్తాడు.

విభీషణుడు, రాముడికి మద్దతు ఇచ్చినప్పటికీ, నిజానికి అతను అసురుడు అవ్వడం చేత దేవతలు, రంగనాధ స్వామి విగ్రహాన్ని లంకకు చేరకుండా అడ్డుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇందుకోసం దేవతలు వినాయకుడిని ప్రార్ధిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికలను తీరుస్తానని మాట ఇస్తాడు. విభీషణుడు తిరుచ్చి సమీపంలోని విగ్రహాన్ని తీసుకువెళుతుండగా కావేరి నది కనిపించగా పుణ్యస్నానం చేయాలని భావిస్తాడు. అయితే విగ్రహాన్ని నేలపై పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుందన్న కారణంతో అక్కడే పశువుల కాపరి రూపంలో ఉన్న వినాయకుడి సాయం కోరతాడు. కొద్ధి సమయం మాత్రమే తాను విగ్రహాన్ని పెట్టుకుంటానని సమయం ముగిసిన తరువాత విగ్రహాన్ని నేలపై పెడతానని బాలుడు చెబుతాడు. దీనంతటినీ అంగీకరించిన విభీషణుడు ఆ విగ్రహాన్ని ఆ బాలుడి చేతికి ఇస్తాడు. కొద్దీ సేపటికే బాలుడి రూపంలో ఉన్న గణపతి, రంగనాధ స్వామి విగ్రహాన్ని భూమిపై పెడతాడు. దీనికి ఆగ్రహించిన విభీషణుడు పరుగున నది నుండి వచ్చి, గణపతిని పట్టుకోవడానికి వెంబడిస్తాడు. బాలుడు వెంటనే పారిపోతాడు. చాలా దూరం పరిగెత్తిన గణపతి, కొండపైకి వెళతాడు. చివరికి విభీషణుడు, బాలుడిని పట్టుకుని నుదుటిపై గట్టిగా కొడతాడు. దీనితో స్వామి నవ్వుతూ అసలు రూపంలో దర్శనమిస్తాడు. విభీషణుడు వెంటనే క్షమాపణలు కోరడంతో గణపతి, అతనికి ప్రసాదించిన రంగనాధుని విగ్రహం కావేరో నది తీరంలోనే ఉంటుందని వెల్లడిస్తాడు. అనంతరం వినాయకుడు అక్కడే స్వయంబుగా వెలసినట్లు తెలుస్తుంది. వినాయకుడి నుదుటిపై విభీషణుడు కొట్టిన నొక్కు కూడా మనం ఈరోజుకీ చూడవచ్చు. ఈ ఆలయంలో స్వయంబుగా వెలసిన వినాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే గణనాయకునిగా ప్రసిద్ధి.

తరువాత రంగనాదుని విగ్రహం ఉంచిన ప్రదేశం దట్టమైన అడవులతో కప్పబడి పోతుంది. చాలా కాలం తరువాత చోళుల చక్రవర్తి, ఒక చిలుకను వెంబడించగా ఆ దట్టమైన అడవిలోకి వెళుతుంది. దానిని వెతకగా రంగనాధుని విగ్రహం దర్శనమిస్తుంది. దీనితో చోళుల చక్రవర్తి రంగనాధ ఆలయాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ సముదాయాలుగా స్థాపించారు. ఇప్పుడే ఇదే శ్రీరంగంగా పిలవబడుతుంది. ఇంతలో పల్లవులు, విభీషణుడు బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన వినాయకుడికి ఒక ఆలయాన్ని అలాగే తైమన ఆలయాన్ని కూడా నిర్మించారు.
