సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ గీత గోవిందం. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది. ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాని రూపొందించిన టీమ్ మెంబర్స్ ఎవరూ కూడా.. ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించి ఉండరు. అంతటి విజయాన్ని సాధించింది ఈ సినిమా.

అసలు.. గీత గోవిందం బ్లాక్ బస్టర్ విజయం సాధించడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. మెయిన్ గా హీరోయిన్ ని బ్రతిమాలుకునే విధానం, వారి మధ్య కెమిస్ట్రీ కొత్తగా ఉండడంతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక్కడ హీరో, హీరోయిన్ కనపడకుండా కేవలం పాత్రలు మాత్రమే కనిపించాయి.

ఇక కథానాయకిగా నటించిన రష్మిక, గీత పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరోని టార్చర్ పెట్టే సన్నివేశాల్లో ఆమె నటన మరియు హీరో మీద కోపం చూపించే సందర్భాల్లో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు పర్ ఫెక్ట్ అనేలా ఉన్నాయి. ఇక వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ తో, మ్యానరిజమ్స్ తో బాగా నవ్వించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, అన్నపూర్ణ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా బస్ లో విజయ్, రష్మిక మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

దర్శకుడు పరుశు రామ్ సింపుల్ స్టోరీని తీసుకున్నా చక్కని ట్రీట్మెంట్ తో మంచి కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఇక అసలు విషయానికి వస్తే… పరశురామ్ ఈ సినిమా కథ రాసిన తర్వాత అల్లు అర్జున్ కి చెప్పారని.. కథ బాగుందన్నారు కానీ.. ఎందుకనో ఆయన ఈ కథతో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించలేదని టాక్ వచ్చింది. ఆతర్వాత అల్లు శిరీష్ కూడా ఈ కథ చెప్పారని.. ఆయన కూడా కథ బాగుందన్నారు కానీ.. సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదని వార్తలు వచ్చాయి.

మరో విషయం ఏంటంటే.. నాగ చైతన్య దగ్గరకి కూడా గీత గోవిందం స్టోరీ వెళ్లిందని.. అక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందని ఆఖరికి విజయ్ దేవరకొండ ఈ కథకు ఓకే చెప్పాడంతో సెట్స్ పైకి వెళ్లిందని తెలిసింది. అయితే… వీళ్లు ఎవరు కూడా గీత గోవిందం ఇంతటి విజయాన్ని సాధిస్తుందని ఊహించి ఉండరు. అందుకే ఈ సినిమా చేయడానికి నో చెప్పారు. అలా నో చెప్పడానికి కారణం ఏంటంటే.. హీరో, హీరోయిన్ వెనకాల మేడమ్ మేడమ్ అంటూ తిరగడం అనేది నచ్చలేదని… అందుకే నో చెప్పారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదీ.. సంగతి..!
