పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెతను మనం తరచుగా వింటుంటాం. అలాగే మన దగ్గర ఉన్న వాటిని పట్టించుకోకుండా లేనివాటి గురించి ఆలోచిస్తాం. కొన్నిసార్లు చేతిలోని వజ్రాలను వదిలేసి రంగురాళ్ల కోసం పాకులాడే ప్రయత్నం చేస్తాం. ఇంతకీ ఈ ఉపోత్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే.. మనదేశంలో పుట్టి ప్రపంచాన్ని ఏలుతున్న కళలను.. మనం మర్చిపోయాం. వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేసుకున్నాం. అవే విద్యలను నేర్చుకునేందుకు విదేశాల బాటపడుతున్నాం. అక్కడ నేర్చుకుని వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంతకీ మన దగ్గర పుట్టిన ఆ కళలేంటి?ఇక్కడ ఎందుకు కాపాడుకోలేకపోయాం? విదేశాలకు అవి ఎలా వెళ్లాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం!

మార్షల్ ఆర్ట్స్ అనగానే మనకు టక్కున గుర్తుచ్చే దేశాలు చైనా, జపాన్. కుంఫూ నేపథ్యంలో తీసిన సినిమాల హీరోలు అనగానే బ్రూస్ లీ, జాకీ చాన్ కళ్లముందు కదలాడుతారు. అయితే ఈ దేశాలకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసిన వ్యక్తి ఓ భారతీయుడు అని చాలా మందికి తెలియకపోవడం విశేషం. అవునూ.. మనదేశంలో పుట్టిన ఈ కళ్లలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వ్యక్తి ఓ సౌత్ ఇండియన్. ఆ మహానుభావుడి పేరు బోధిధర్మ.

బోధిధర్మ భారతదేశం నుంచి వెళ్లి.. చైనీయులకు ఈ విద్యను బోధించాడు, నిజానికి ఇతడు ఓ రాజకుమారుడు. ప్రస్తుత తమిళనాడులోని చెన్నై సమీపంలో ఉన్న కాంచీపురంలో జన్మించారు. క్రీస్తుశకం 5వ శతాబ్దంలో కాంచీపురాన్ని పరిపాలిస్తున్న పల్లవ రాజుకు మూడో సంతానంగా ఆయన జన్మించారు. తనకు యుద్ధకళలతో పాటు ఆధ్యాత్మిక భావనలు అధికంగా ఉండేది. తన ఏడో ఏటనే బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయన గురువు ప్రజంతర. అప్పటి వరకు బోధి తారగా పిలువబడే ఆయన బౌద్ధం తీసుకున్న తర్వాత బోధిధర్మగా మారాడు. మరికొద్ది రోజుల్లోనే బోధిధర్మ తండ్రి కన్నుమూశారు. అనంతరం తన గురువుతో కలిసి దేశ సంచారానికి బయల్దేరాడు బోధిధర్మ. వీరిరువురూ దేశ వ్యాప్తంగా తిరుగుతూ బౌద్ధమతాన్ని ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. ఆయన గురువు పంచమంతటా బౌద్ధమతం ఉండాలని భావించేవారు. ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. తన చివరి కోరికగా భారతదేశంలోని చుట్టుపక్కల దేశాల్లో ఈ మతాన్ని ప్రచారం చేయాల్సిందిగా బోధిధర్మకు సూచిస్తారు.

గురువు కోరిక మేరకు బౌద్ధమత ప్రచారమే లక్ష్యంగా చైనాకు బయల్దేరాడు. అనుకున్న ప్రాంతానికి వెళ్లేందుకు సుమారు మూడేండ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కొండలు, కోనలు, అడవులూ, ఎడారులు దాటుతూ చైనాకు చేరుకున్నారు. చైనాకు వెళ్లిన తర్వాత బోధిధర్మ చేసిన తొలిపని చైనా భాషను నేర్చుకోవాలనుకున్నాడు. ఎంతో కష్టమైన ఈ భాషను అనుకున్న సమయాని కంటే ముందే నేర్చుకున్నారు. ఎప్పుడైనా తమ భావజాలాన్ని ప్రజల్లోకి చేరవేయాలంటే వారి మాతృభాషలో చెప్పడమే ఉత్తమం. ఇదే సూత్రాన్ని ఆయన అమలు చేశాడు. అనంతరం స్థానిక చైనీస్ భాషలో అక్కడి ప్రజలతో మమేకమయ్యారు.

క్రీస్తు శకం 527వ సంవ్సతరంలో దక్షిణ చైనాను లియాంగ్ అనే చక్రవర్తి పరిపాలించాడు. ఆయనకు బౌద్ధమతం పట్ల ఎంతో నమ్మకం ఉండేది. భారత్ నుంచి ఓ బౌద్ధమత బోధకుడు తమ ప్రాంతానికి వచ్చాడని ఆయన తెలుసుకుంటాడు. ఎంతో సంతోష పడతాడు. వెంటనే తనని ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆయనకు చక్కటి అతిథి మర్యాదలు అందజేస్తాడు. తన సందేహాలను తీర్చాల్సిందిగా బోధిధర్మను కోరుతాడు. అందుకు బోధిధర్మ అంగీకరిస్తారు. తాను బౌద్ధమత ఫాలోవర్‌గా ఎన్నో మంచి పనులు చేసినట్లు చెప్తాడు. తన రాజ్యంలో ఎన్నో బౌద్ధ ఆలయాలు నిర్మించినట్లు చెప్తాడు. ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలిచినట్లు వెల్లడిస్తాడు. యుద్ధ సమయంలో శత్రువులను సైతం దయతో వదిలేసినట్లు చెప్తాడు. తన పుణ్యకార్యాల మూలంగా స్వర్గం ప్రాప్తిస్తుందా? అని లియాంగ్ అడుగుతాడు. చక్రవర్తి ప్రశ్నలతో బోధిధర్మకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. చేసిన పుణ్యాలను లెక్కపెట్టుకునే వాడికి పుణ్యం వచ్చే ప్రసక్తే లేదని చెప్తాడు. చేసే మంచి పనులు ఎలాంటి ఫలితం ఆశించకుండా ఉండాలే తప్ప.. తమ స్వార్థం కోసం మంచి కార్యాలు చేయకూడదంటారు. చేసిన పనులను గుర్తుపెట్టుకున్న నీకు కచ్చితంగా నరకమే లభిస్తుందని మండిపడతారు.ఆయన మాటలు చక్రవర్తికి తీవ్ర కోపాన్ని తెప్పిస్తాయి. తన రాజమందిరం నుంచి వీడిని తరిమేయాలని ఆదేశిస్తాడు. చక్రవర్తి కోపానికి గురైన బోధిధర్మను కలిసేందుకు ప్రజలకు కూడా భయపడుతారు. విదేశీగడ్డపై బోధిధర్మ ఒంటరిగా మిగులుతాడు. చక్రవర్తితో పాటు ఆ రాజ్య ప్రజల మీద కూడా ఆయకు తీవ్ర అసహ్యం కలుగుతుంది.

చైనాకు వచ్చినందుకు తనకు తానే బాధపడుతూ బోధిధర్మ షావలిన్ అనే నగరానికి చేరుకుంటాడు. సమీపంలోని కొండ గుహలోకి వెళ్తాడు. గోడవైపు ముఖం పెట్టి ధ్యానంలో మునిగిపోతారు. సుమారు 10 ఏండ్ల పాటు ఆయన ధ్యానం కొనసాగుతుంది. ఆయన కఠిన ధ్యానాన్ని గమనించిన హ్యూక్ అనే యువకుడు.. ఎలాగైనా బోధిధర్మ శిష్యరికం చేయాలనుకుంటాడు. ఈ విషయాన్ని బోధిధర్మకు ఎన్నోసార్లు విన్నవించుకుంటాడు. ధ్యానముద్రలో ఉన్న ఆయన హ్యూక్ మాటలను పట్టించుకోడు. నెలల తరబడి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. వాతావరణం మైనస్ డిగ్రీల్లోకి మారిపోతుంది. అయినా బోధిధర్మ మాటలకోసం హ్యూక్ ఎదురు చూస్తాడు. అయినా బోధిధర్మ పలకరించడు. తీవ్ర నిరాశకు గురైన హ్యూక్ కోపంతో తన చేతిని ఖడ్గంతో నరికివేసుకుంటాడు. రక్తం ఏరులైపారుతుంది. ఆ రక్తపు దారలు బోధిధర్మ దగ్గరకు చేరుకుంటాయి. వెంటనే ఆయన ధ్యానం నుంచి బయటకు వస్తారు. హ్యూక్ పట్టుదలకు ముగ్ధుడవుతారు. విద్య నేర్చుకునేందుకు ఆయన చూపిన శ్రద్ధపట్ల సంతోషం వ్యక్తం చేస్తాడు. హ్యూక్‌ను తన శిష్యుడిగా తీసుకుంటాడు. హ్యూక్ పేరును షెన్ గ్యాంగ్‌గా మారుస్తాడు. షెన్ గ్యాంగ్ అంటే జ్ఞానంతో కూడిన సామర్థ్యం అని అర్థం. షావలిన్లోని తన మందిరంలో షెన్ గ్యాంగ్‌కు విద్యను నేర్పుతాడు. తన యుద్ధకళలను బోధిస్తాడు.

అయితే షావలిన్ ప్రాంతంలోని యువకులను చూసి బోధిధర్మకు తీవ్ర ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే.. వారందరి శరీరాలు కొవ్వుతో నిండిపోయి ఉంటాయి. వారి శరీరాలు లావుగా ఉంటాయి. యాక్టివ్నెస్ తక్కువగా ఉంటుంది. ఒంట్లో ఏమాత్రం బలం కనిపించదు. వారందరినీ పరాక్రమవంతులను తయారు చేయాలనుకుంటాడు. భారతదేశంలో తను నేర్చుకున్న హతయోగం, రాజయోగం కళలను వారికి బోధిస్తాడు.వారంతా ఆయా కళల్లో ఆరితేరుతారు. షావలిన్ నగరంలోని యువకులంతా బోధిధర్మ దగ్గర నుంచి ఎన్నో కళలు పొందుతారు. శారీరకంగా, మానసికంగా మంచి ధృఢత్వాన్ని పొందుతారు. ఆయన ఎంతో కాలం పాటు అక్కడ ఈ విద్యలు నేర్పిస్తారు. ఆయన నేర్పిన ఈ విద్యలే ఇప్పుడు చైనాతో పాటు జపాన్ దేశాల్లో మార్షల్ ఆర్ట్స్, కుంఫూలుగా వర్ధిల్లుతున్నాయి. దానితో పాటు బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తారు.

కొంత కాలం తర్వాత షెన్ గ్యాంగ్‌ను తన వారసుడిగా ప్రకటిస్తారు. ఈ ఎంపిక నచ్చని ఓ శిష్యుడు బోధిధర్మకు ఆహారంలో విషం కలిపి పెడతాడు. చనిపోయిన ఆయనను అక్కడే సమాధి చేస్తారు. ఆయన చనిపోయి మూడేళ్లు గడుస్తుంది. దక్షిణ చైనా సామ్రాజ్యం మంత్రి సాంగ్యూన్కు ఓ రోజు పామీర్ పర్వత సమీపంలో బోధిధర్మ దర్శనం ఇస్తాడు. ఆయన తన చేతిలో ఓ షూ పట్టుకుని వెళ్తుండగా గమనిస్తాడు. సాంగ్యూన్ బోధిధర్మను ఆపి మాట్లాడుతాడు. ఎటు వెళ్తున్నారు అంటూ ప్రశ్నిస్తాడు. తన సొంతూరుకు వెళ్తున్నట్లు బోధిధర్మ చెప్తాడు. చేతిలో షూ ఎందుకు అని అడుగుతాడు. దీనికి సమాధానం దొరకాలంటే షావలిన్ నగరానికి వెళ్లాలంటాడు. అంతేకాదు.. త్వరలో మీ చక్రవర్తి చనిపోతాడని చెప్తారు. తనను చూసినట్లు ఎవరికైనా చెప్తే ఇబ్బందులు తప్పవంటాడు. సాంగ్యూన్ చక్రవర్తి దగ్గరకు వెళ్లగానే జరిగిన విషయాన్ని వివరిస్తాడు. ఎప్పుడో చనిపోయిన బోధిధర్మ గురించి తనకు అబద్దాలు చెప్తున్నావంటూ చక్రవర్తి తనని కారాగారంలో బంధిస్తాడు. అయితే ఏదో ఓ మూలన ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు తన సైనికులను షావలిన్ నగరానికి పంపిస్తాడు. బోధిధర్మ సమాధిని తవ్విస్తాడు. అందులో కేవలం ఓ షూ మాత్రమే కనిపిస్తుంది. అంటే బోధిధర్మ సమాధి నుంచి వెళ్లిపోయాడని తెలుసుకుంటారు. తన సొంతూరు వెళ్తున్నానని చెప్పాడంటే.. భారతదేశానికి తిరిగి వెళ్లాడని అందరూ భావిస్తారు. అయితే ఆయన నిజంగానే భారత్‌కు వచ్చాడా? అనేది మిస్టరీగానే మిగిలింది.

బోధిధర్మను బుద్ధుడి తర్వాత 28వ బౌద్ధ గురువుగా భావిస్తారు. బోధిధర్మ శిష్యుడు షెన్ గ్యాంగ్‌ను 29వ బౌద్ధ గురువుగా ఆరాధిస్తారు. బోధిధర్మ నేర్పించిన ధ్యానం.. చైనీయుల భాషకు అనుగుణంగా చాన్‌గా రూపొందింది. ఇది జపాన్‌కు చేరి జేన్‌గా రూపాంతరం చెందింది. ఈ విధంగా భారత్‌లో పుట్టిన రాజయోగం అనే కళ.. బోధిధర్మ మూలంగా చైనాకు చేరింది. ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, కుంఫూలుగా ప్రపంచాన్ని చుట్టేశాయి. ప్రస్తుతం ఈ కళలను నేర్చుకోవడానికి భారతీయులు చైనా, జపాన్‌కు వెళ్తుంటారు. నిజంగా భారతీయులుగా మనం బాధపడాల్సిన విషయం. మనకళను కాపాడుకోలేకపోయినందుకు చింతిచాలి.

మన మహామనిషి బోధిధర్మ గురించి ఇక్కడ ఎవరికీ తెలియకపోయినా.. చైనా, జపాన్ వాసులందరికీ ఎంతో సుపరిచితం. ఆయనకు సంబంధించిన ఎన్నో కథలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆయనకు సంబంధించిన ఓ కథ గురించి తెలుసుకుందాం! ఓసారి బోధిధర్మ ధ్యాపంలో ఉండగా.. ఓ రోజు తనకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లారట. కొద్ది సేపటికి నిద్ర నుంచి మేల్కొని తనపై తాను కోపంతో రగిలిపోయారట. వెంటనే తన కనురెప్పలను కత్తిరించుకున్నారట. ఆయన కనురెప్పలు భూమ్మీద పడిన చోట కొన్ని మొక్కలు పెరిగాయట. షావలిన్ ప్రజలు ఈ మొక్కల ఆకులను పొడిగా మార్చి టీ తయారు చేసుకుని తాగారట. ధ్యానం చేస్తున్న సమయంలో నిద్ర రాకుండా ఉండేందుకు ఈ టీ తాగేవారట. బోధిధర్మ ధ్యానం చేసిన ఆ ప్రాంతాన్ని చాయ్ అని పిలవడం విశేషం. అయితే చైనా మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తుంది. క్రీస్తు పూర్వమే చైనీయులు టీ పొడిని కనుక్కున్నారని చెప్తారు. మొత్తానికి భారతదేశంలో పుట్టిన మన రాజయోగం అనే కళ.. బోధిధర్మ మూలంగా ప్రపంచాన్ని ఏలుతోంది. మనం మర్చిపోయినందుకు సిగ్గుపడుదాం!
