ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో ఓ సంచలనం. ఆయన తీసిన సినిమాలు క్లీన్ గా ఉంటూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేయి. దాంతో స్టార్ హీరోలు సైతం ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలి అనుకునేవారు. ఆయన నాగార్జునతో వజ్రం, బాలకృష్ణతో టాప్ హీరో సినిమాలు చేశారు. అయితే.. చిరంజీవితో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆ ప్రాజెక్ట ఏమైందో తెలియదు. ఎందుకు ఆగిందో తెలియదు. ఇదే విషయం గురించి ఎస్వీ కృష్ణారెడ్డిని అడిగితే.. అసలు విషయం చెప్పారు.

ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. చిరంజీవి గారితో సినిమా చేయడానికి మాట్లాడడం జరిగింది. ఉగాది సినిమాకి చిరంజీవి గారు అభినందించడం జరిగింది. ఆ సినిమా కోసం చిరంజీవి గారు యాడ్ కూడా చేయడం జరిగింది. వాళ్ల బ్యానర్ లో పెళ్లాం ఊరెళితే అనే సినిమా కూడా చేశాను. అప్పుడు ఎక్కువుగా బాగా కలిసేవారు. నా గురించి స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. అది ఎప్పటికీ మరచిపోలేను. ఆయనకు అద్భుతమైనటువంటి రెండు కథలు కూడా చెప్పడం జరిగింది. ఒక కథతో వచ్చిన సమస్య ఏంటంటే.. అంతటి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఉందా..? అనే ప్రశ్నకు సమాధానం లేక ఆ సినిమా ఆగిపోయింది.

ఇంకో సబ్జెక్ట్ బాగానే ఉంది కానీ.. ఎక్కలేదు. ఇలా చిరంజీవి గారితో చేద్దామనుకున్న కాన్సెప్టులు కుదరలేదు. అశ్వనీదత్ గారి బ్యానర్ లో చిరంజీవి గారు నటించిన ఓ సినిమా ఆగిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ దానికి. సాంగ్స్ షూట్ చేశారు. ఈ సాంగ్స్ ఉపయోగించుకుని ఏదైనా ఒక లైన్ ఉంటే చెప్పు అని దత్ గారు అన్నారు కానీ.. నాకు అంత థైర్యం లేదు అని చెప్పాను. కారణం ఏంటంటే.. చిరంజీవితో సినిమా చేస్తున్నాం అంటే సమ్ థింగ్ స్పెషల్ అనేట్టుగా ఉండాలి. మామూలుగా ఉండడానికి వీలులేదు. అందుచేత కథ సెట్ అయితే చేద్దాం అని చెప్పి శుభలగ్నం వైపు వెళ్లాను. శుభలగ్నం చిత్రం ఎప్పుడైతే సెన్సేషనల్ హిట్ అయ్యిందో అప్పుడు నా దారి మళ్లించి ఈ యాంగిల్ వైపుకు తీసుకెళ్లింది అంటూ చిరంజీవితో సినిమా ఆగిపోవడం వెనకున్న కారణం ఏంటో చెప్పారు కృష్ణారెడ్డి.
