శ్రీ శైల ఆలయ చరిత్ర

మన పురాతన భారత దేశంలో ఆద్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిసాయి. వాటిలో యుగయుగాలు భక్తకోటిచే నిత్య పూజలు అందుకుంటున్న ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి ముఖ్యం. అటువంటి పరమ పావన క్షేత్రాలలో ఒకటి మన తెలుగు నేలపై కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం.

ఈ ప్రపంచంలో ఏ ఆలయానికి లేని ప్రత్యేకత ఈ ఆలయానికి ఉంది. మన ఇళ్ళలో, ఆలయాలలో చేసే పూజ ఆరంభంలో చెప్పే సంకల్పం శ్రీశైలస్య ప్రదేశే అని ఉంటుంది. దీని బట్టే చెప్పవచ్చు ఈ ఆలయం ఎంత విశిష్టమైనదో. కేవలం ఈ క్షేత్రం వద్దనే వేదఘోష స్పురింపజేసే విధంగా కృష్ణవేణి పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినై ప్రవహిస్తుంది.

అత్యంత పావన శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం వెలసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఇప్పటకీ తెలియని ఒక మిస్టరీ. ఈ ఆలయం సృష్టి ఆరంభం నుంచి ఉందని హిందువుల ప్రగాడ విశ్వాసం. భారత రామాయణాది ఇతిహాసాల్లోనూ, అష్టాదశ పురాణాల్లోనూ శ్రీశైల వైభవం గురించి పేర్కొనబడింది. అంతేకాక సంస్కృత, ఆంద్ర, కన్నడ, మరాఠీ పురాతన గ్రంథాల్లో ఈ క్షేత్రం గురించి అనేక వర్ణనలు ఉన్నాయి. 64 అధ్యాయాలు ఉన్నటువంటి స్కాందపురాణంలో శ్రీశైల ఖండం, ఈ క్షేత్ర మహత్తును వివరిస్తోంది. అంతే కాదు ఆది గురువు శంకరాచార్యులు వారు కూడా ఈ క్షేత్ర మహత్యానికి ముగ్ధుడై ఇక్కడే కొంత కాలం తపస్సు చేసుకుని శివానంద లహరి ని రచించి, ఆ మల్లికార్జునుడికి సమర్పించారు.

ఈ ఆలయం కేవలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగానే కాకుండా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి కూడా. ఇక్కడ కొలువైన భ్రమరాంబ దేవి ఉగ్ర తేజస్సుని శాంతింపజేసి ఆ మత సన్నిధిలో శ్రీ చక్రాన్ని ఆదిశంకరులే ప్రతిష్టించారని చరిత్ర చెబుతుంది. అంతేగాక పూర్వం ఈ క్షేత్రాన్ని శిరిగిరి, శ్రీగిరి, శ్రీధన్, శ్రీపర్వతము, శ్రీనగము, శ్రీకైలాసము అనే పేర్లతో పిలవబడినట్లు అక్కడి రాతి శాసనాల ద్వారా తెలుస్తుంది.

కృతయుగంలో హిరణ్యకశిపుడు మల్లికార్జున సమేత భ్రమరాంబ దేవిని విశేషంగా పూజించాడనీ, త్రేతాయుగంలో శ్రీ రామ చంద్రుడు రావణ వధ అనంతరం బ్రహ్మ హత్యా దోషాన్ని తొలగించుకోడానికి సతీసమేతంగా ఇక్కడికి వచ్చి వెయ్యు లింగాలను ప్రతిష్టించి పూజించాడనీ, ద్వాపరయుగమున పాండవులు వనవాస సమయంలో ఈ క్షేత్రానికి వచ్చి లింగప్రతిష్టలు చేసారని ఈ క్షేత్ర చరిత్ర చెబుతుంది. ఇన్ని యుగాలుగా బాసిల్లుతున్న శ్రీశైల ఆలయాన్ని దేవతలే కట్టారని పురాణ విదితం. అయితే 2వ శతాబ్దం నుంచి శ్రీశైల అభివృద్ధి బాగా జరిగినట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది.

తెలుగు నేలను పాలించిన, అతిపురాతన రాజవంశాలలో ఒకటైన శాతవాహన వంశంవారు శ్రీశైల క్షేత్రాన్ని విశేషంగా ఆరాధించారు. ఆ వంశానికి చెందిన పులోమావి అనే రాజు ఈ ఆలయంలో అనేక మండపాలు, మరికొన్ని కట్టడాలు కట్టించినట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. విజయపురి రాజధానిగా తూర్పు దక్కన్ ప్రాంతాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశస్థులు కూడా మల్లికార్జున స్వామికి పరమ భక్తులుగా పేరుపొందారు. అందువల్ల ఈ వంశం వారు శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసారు. 3వ శతాబ్దం నాటికి తెలుగు నెల శాతవాహనులు, ఇక్ష్వాకుల పాలనలోంచి పల్లవ రాజులు చేతిలోకి రాగ, ఆ వంశానికి చెందిన త్రిలోచన వర్మ అనే రాజు ప్రధాన ఆలయానికి దగ్గరలోనే అర్చకులు ఉండాలని వారికి నివాసాలను ఏర్పరిచారు. పల్లవుల తర్వాత ఈ ప్రాంతం చోళ్ళులు, మగధ వంశస్థులు, చాళుక్యులు, కాకతీయులు వంటి పలు రాజ వంశాల వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో త్రిలింగ దేశాలలోని సకల శైవ క్షేత్రాలు విశేషంగా అభివృద్ధి చెందాయి. ఆ వంశానికి చెందిన రాణీ రుద్రమ్మ దేవి, ప్రతాప రుద్రుడు స్మామి వారికి తులాభారాలతో పాటు ఈ ఆలయంలో అనేక నిర్మాణాలు చేపట్టి శ్రీశైల అభివృద్ధికి విశేషంగా పాటుబడ్డారు. వారి వద్ద సామంత రాజైనటువంటి పేకేటి కొమ్మయ్య స్వామి వారి మధ్యాహ్న పూజలు కోసం విశేషంగా ఆస్తులను విరాళంగా సమర్పించుకున్నాడు. కాకతీయ వంశం పతనం అయ్యిన తర్వాత ఈ ప్రాంతం “రెడ్డి రాజుల” పాలనలోకి వెళ్ళింది. ఆ వంశానికి చెందినా “ప్రోలయ వేమారెడ్డి” పాతాళగంగ వద్ద మెట్ల మార్గాన్ని నిర్మించినట్లు శాసనాలు ఉండగా, అదే వంశానికి చెందినా “అన వేమా రెడ్డి” వీర శిరోమండపం నిర్మించాడు.

ఆ తర్వాత రెడ్డి రాజులను ఓడించి కార్ణాటకతో పాటు దాదాపు తెలుగు నేలను మొత్తం రాయల వంశస్థులు తమ హస్తగతం చేసుకున్నారు. ఈ వంశానికి చెందినా “శ్రీ కృష్ణ దేవరాయుల” వారు పాలించిన సమయం ఒక సువర్ణ యుగంగా చరిత్రకారులు విశేషంగా కీర్తిస్తారు. ఈయన పాలనలో శ్రీశైలంతోపాటు తక్కిన పుణ్యక్షేత్రాలు అన్నీ అమోఘంగా అభివృద్ధి చెందాయి. ఇప్పటికీ ఆంధ్ర, కన్నడ రాష్ట్రాలలోని దాదాపు అన్ని పురాతన ఆలయాలలో కృష్ణ దేవరాయుల వారు కట్టించిన కట్టడాలు అత్యద్బుతమైన శిల్ప సౌందర్యంతో భాసిల్లుతున్నాయి. వీరి తర్వాత మరాఠ రాజైనటువంటి చత్రపతి శివాజీ మహరాజ్ శ్రీశైల మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ మాతను విశేషంగా పుజించాడంతో పాటు అనేక కానుకలను సమర్పించుకున్నారు.

శ్రీశైల క్షేత్రంలోకి అడవి జంతువులు, దుష్ట మూకలు రాకుండా ఉండటానికి ఈ ఆలయం చుట్టూ ఎతైన గోడలను నాటి రాజులు కట్టించారు. విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయులు శ్రీశైల క్షేత్రానికి దక్షిణ గోపుర ద్వారాన్ని, ముఖమంటపాన్నీ నిర్మించగా, శ్రీ కృష్ణ దేవరాయుల వారు, ఆలయ ప్రధాన ద్వారం వద్ద గాలిగోపురాన్ని నిర్మించారు. 1677 లో ఈ ఆలయాన్ని దర్శించుకొన్న ఛత్రపతి శివాజీ ఉత్తర గాలి గోపురాన్ని నిర్మించారు. ఆ తర్వాత చాలా ఏళ్ళకి 1996 లో దేవస్థానం వారు పడమట గోపురాన్ని నిర్మించారు.

ఆ తర్వాత ఈ ప్రాంతం ముస్లిం రాజుల పాలనలోకి వెళ్ళగా ఈ స్వామి మహత్యానికి ముగ్ధులైన ఆ పాలకులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యడం ఒక విశేషం అని చెప్పుకోవాలి. ఔరంగజేబు కాలంలో కర్నూలు ప్రాంతం దావూద్ ఖాన్ అనే సేనాని పాలనాలోకి వెళ్ళగా, అతడు మరియు అతడి సోదరుడు ఇబ్రహీం ఖాన్ శ్రీశైల క్షేత్రాన్ని విశేషంగా అభివుద్ధి చేసారు. ఆ తర్వాత భారతదేశం బ్రిటీషువారి పాలనలోకి వెళ్ళగా ఆ సమయంలో ఆలయ నిర్వహణ భాధ్యతలు పుష్పగిరి మఠం వారు స్వీకరించారు. ఆ తర్వాత 1929లో ఆలయానికి ఒక ప్రత్యేకమైన బోర్డు ఏర్పడింది. భారత దేశానికి స్వాతంత్రం అనంతరం ఈ ఆలాయ బాద్యతలు దేవాదాయ, ధర్మాదాయశాఖ చేతిలోకి వెళ్ళింది.

కాలం మారినా, యుగాలు గడిచిన ఆ నీలకంఠుడి పై ఉన్న ప్రగాడ విశ్వాసం దేవతల దగ్గర నుంచి రాజులు, సామాన్యుల వరకు ఆయన్ని మొక్కుతూ ఆ మల్లికార్జునుడిని విశేషంగా పూజించారు. ఇదండీ శ్రీశైల క్షేత్రం ఆలయ చరిత్ర.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles