సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సమయంలో) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. సంధ్యావందనము కర్మలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మరియు గాయత్రీ మంత్ర జపం చేయాలి.

పగలు రాత్రిగాను, రాత్రి పగలుగాను మారే ముందు సమయాన్ని సంధ్య అని అంటారు. రాత్రి పగలుగా మారే ముందు అంటే సూర్యోదయానికి ముందు సమయాన్ని ప్రాతస్సంధ్య అని, పగలు రాత్రిగా మారే ముందు సమయాన్ని సాయం సంధ్య అని, సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు మధ్యాహ్న సంధ్య అని అంటారు. మానవ జీవితాన్ని సక్రమంగా నడిపించడానికి ఇన్ని మార్పులు చేస్తున్న ఆ భగవంతుడిని సూర్యుని రూపంగా భావిస్తూ వందనం చేయడమే సంధ్యావందనం. సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు సూర్యుని రథానికి మందేహులు అనే రాక్షసులు అడ్డుగా నిలుస్తారు. సంధ్యావందనం చేసేటప్పుడు దోసిళ్ళలోకి తీసుకుని పైకెత్తి వేసినప్పుడు ఆ నీటి తుంపరలు ఆ సమయంలో చదివే మంత్రాలకు ఆ మందేహులు అనే రాక్షసులు చెల్లా చెరవుతారు. ఆ విధంగా సూర్యునికి ఆ రాక్షసుల అడ్డు తొలగించడానికి సంధ్యావందనం చేస్తారు.

సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము- రాత్రి యొక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా అంటే తెల్లవారుజాము సమయంలో చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని ఇప్పుడు సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము మధ్యాహ్న 12 గంటల సమయంలో చేయుట ఉత్తమం. సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండా చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. సంధ్యా వందనము పురుడు, మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు మాత్రమే చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనిచో మనస్సులో సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేయవలెను.

ఉపనయన సంస్కారం ఉన్నవారు, ఉపనయనం అయినప్పటినుండి ప్రతినిత్యం తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఉపనయన ఆచారం ఉన్నవారు ఒక విధంగా చేస్తారు. ఉపనయన ఆచారం లేని వారు మరో విధంగా చేస్తారు. ఋగ్వేదీయులు, సామవేదీయులు, యజుర్వేదీయులలో సంధ్యావందనం వేర్వేరుగా ఉంటుంది. పూర్తిగా వేరా అంటే కొన్ని కొన్ని భేదాలతో ఒకే విధంగా అంటుంది. మంత్ర భేదమున్నప్పటికీ- దాని తత్వం, పరమార్ధం, ప్రయోజనం, అంతరార్ధం అనేవి మారవు.

ద్విదులు అంటే మూడు వర్ణముల వారు అనగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ముగ్గురు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఎంత పండితులైనా ఏ ఇద్దరూ ఒకలా సంధ్యావందనం చేయరు. పూర్తి సంధ్యావందనానికి 20 నిముషాల మాత్రమే సమయం పడుతుంది. రోజులో ఏ పూట చేసే పాపం ఆ సంధ్యా సమయంలో సంధ్యా వందనం ద్వారా పోతుందని పురాణాలు చెబుతున్నాయి.
