ఒంటి నిండా సిందూరం లేని హనుమంతుని విగ్రహాలు ఉండటం చాలా అరుదు. ఆలయాల్లో ఉండే హనుమంతుడి ఒళ్ళంతా సిందూరం ఎందుకు పూస్తారు? ఒకవేళ హనుమంతుడికి సిందూరం అంటే ఇష్టమా అన్న సందేహం రావచ్చు?హనుమంతుని ఒళ్ళంతా సిందూరం ఉండటానికి ఒక ఆదర్శవంతమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

ఒకనాడు హనుమంతుడు శ్రీరాముడిని చూసేందుకై అయోధ్యా నగరానికి వెళ్ళాడు. అక్కడ సిందూరం పెట్టుకుంటున్న సీతమ్మ తల్లిని తదేకంగా చూస్తూ ఉండిపోయాడట. దీనికి సీతమ్మ తల్లి ఏమిటి హనుమా అలా చూస్తూ ఉండిపోయావు అని అడిగిందట. వెంటనే హనుమంతుడు నెమ్మదిగా సీతమ్మ వద్దకు వెళ్లి తల్లీ నీ నుదుటిన పెట్టుకున్న సిందూర తిలకమునకు అర్థమేమిటి అని అడిగాడట. దానికి సీతమ్మ తల్లి… నేనిలా సిందూరం ధరిస్తే, నా స్వామీ నీ స్వామీ అయిన శ్రీ రాముడి ఆయువు నిత్యమూ పెరుగుతుంది అని సెలవిచ్చిందట.

దానికి హనుమంతుడు, సీతమ్మ తల్లి నుదుటిన అంత సిందూరం పెట్టుకుంటేనే స్వామీ ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా స్వామీ పేరు చెప్పు సిందూరాన్ని పూసుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచించి వెంటనే సిందూరాన్ని తన శరీరానికి రాసుకోవడం ప్రారంబించాడట. కానీ శరీరానికి అంటుకోవడం లేదని గమనించిన హనుమంతుడు దీనికి గల కారణం ఏమై ఉండవచ్చని ఆలోచిస్తే తన ఒంటి నిండా రోమాలు ఉండటమే దానికి గల కారణం అని తెలుసుకున్నాడట. వెంటనే ఆ సిందూరాన్ని నువ్వుల నూనెలో కలిపి మొత్తం ఒంటికి పూసుకుని, శ్రీరాముని వద్దకు వెళ్ళాడట.

హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయిన శ్రీరాముడు ఈ సిందూరం ఏమిటి హనుమా అని అడగగా… హనుమంతుడు ఈ విధంగా సెలవిచ్చాడట. సీతమ్మ తల్లి, మీ ఆయువు పెరగాలని తన నుదుటిన సిందూరం పెట్టుకుంది. నుదుటిన ధరిస్తేనే ఆయువు పెరిగితే నేను ఒళ్ళంతా పూసుకుంటే మీ ఆయువు మరింత పెరుగుతుందని ఇలా చేసాను అన్నాడట హనుమంతుడు. ఈ విషయం విన్న శ్రీరాముడు, ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. దీనితో శ్రీరాముడు- తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ఇక నుండి నీకు సిందూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో అటువంటి భక్తుల అన్ని కోరికలనూ నేను తీరుస్తాను అని శ్రీరాముడు వరమిచ్చాడట.

కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకీ సిందూరం అలంకరంచి పూజించినట్లైతే కోరిన కోరికలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి.


