18 శక్తి పీఠాల రహస్యం

హిందూ పురాణాల ప్రకారం ఆదిపరాశక్తి అంశాల స్వరూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని ప్రజల ప్రగాఢ నమ్మకం. అయితే ఈ అష్టా దశ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. కొన్ని పురాణాలలో 18 అనీ, మరికొన్నింటిలో 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. భారతదేశం, శ్రీలంకలతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ అంతటా విస్తరించిన ఈ అష్టాదశ శక్తి పీఠాలు, మన అమ్మవారి పార్వతి దేవి ప్రతిరూపమైన సతీదేవి యొక్క శరీర భాగాలని పురాణాలు చెబుతున్నాయి. సతీదేవి సౌర్యానికి, దుష్టశక్తుల సంహారానికి ప్రతీక. అయితే ఈ అష్టాదశ శక్తి స్వరూపాల వెనుక ఒక విషాద గాద ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Shakti Peethas

బ్రహ్మకుమారుడైన దక్షప్రజాపతికి 53 మంది కుమార్తెలు. అందులో సతీదేవి ఒకరు. సతీదేవికి చిన్ననాటి నుండి శివుడిపై ఉన్న ఇష్టంతో ఒకరోజు సతీదేవి, తండ్రి అయిన దక్షుడి ఆజ్ఞ లేకుండా శివుడిని వివాహమాడుతుంది. తరువాత ఒకనాడు బ్రహ్మ తలపెట్టిన యాగానికి సకల దేవతలు విచ్చేయగా చివరకు దక్షుడు వస్తాడు. దక్షుడు రాగానే అతనిపై ఉన్న గౌరవ భావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన దేవతలందరూ నిలబడతారు. దానితో కోపాద్రుక్తుడైన దక్షుడు, ఇలా అంటాడు. బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస, నీవు అల్లుడివి అవుతావు. మామగారు వచ్చినప్పుడు నిలబడకుండా నన్ను అవమానిస్తావా అని అంటాడు. అక్కడున్న వారందరూ- వారు త్రిమూర్తులు, వారిని నిలబడమనడం సబబు కాదు అనేటప్పటికీ దక్షుడు మరింత కోపోద్రక్తుడవుతాడు. దీనితో దక్షుడు, బృహస్పతీయాగాన్ని నిర్వహించగా దానికి అందరినీ ఆహ్వానిస్తాడు గాని కూతురినీ, అల్లుడినీ ఆహ్వానించడు. దానికి సతీదేవి, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ఆలోచించి, శివుడు వారించినా వినకుండా, యాగానికి వెళుతుంది. గాని, అక్కడ సతీదేవి అవమానానికి గురి అవుతుంది. ముఖ్యంగా శివనింద సహించలేక సతీదేవి కుడికాలి బొటన వేలి రాపిడితో వచ్చిన అగ్నితో ఆత్మార్పణం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు ఆగ్రహానికి గురై తన గణాలను పంపి, యాగాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెబుతాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరక శివుడు ఆమె మృతశరీరాన్ని తన వద్దే ఉంచుకుని జగద్రక్షణాకార్యాన్ని విస్మరిస్తాడు. సకల దేవతల ప్రార్థనల మేరకు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయని కొన్ని పురాణాలు చెబుతుంటే మరికొన్ని పురాణాలు ఆత్మార్పణం చేకున్న సతీదేవిని శివుడు తీసుకువెళుతున్న సమయంలో ఆ అమ్మవారి భాగాలు ఆయా ప్రాంతాలలో పడటంచేత ఆ అష్టా దశ శక్తి పీఠాలు వెలిశాయని చెబుతున్నాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాతకు తోడుగా భైరవుని (శివుని) రూపం దర్శనమిస్తుంది.

ఆదిశంకరాచార్యులు తెలిపిన అష్టాదశ శక్తి పీఠాల శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం!
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

ఈ శ్లోకం- ఏ అమ్మవారి రూపం ఏ ప్రాంతంలో ఉందో తెలుపుతుంది. మొదటిది శాంకరి దేవి ఆలయం: ఇది శ్రీలంకలోని ట్రిన్కోమలిలో ఉంది. ఇక్కడ అమ్మవారి మొల భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. రెండవది కామాక్షి దేవి ఆలయం- ఇది తమిళనాడులోని కాంచీపురం నందు ఉంది – ఇది మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి మూడవది శృంఖల దేవి ఆలయం – ఇది పశ్చిమ బెంగాల్ లోని ప్రద్యుమ్న నగరంలో ఉంది – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. ఇక్కడ అమ్మవారి పొట్ట భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. నాల్గవది చాముండేశ్వరీ దేవి ఆలయం – ఇది కర్ణాటకలోని మైసూరు దగ్గర క్రౌంచ పట్టణము వద్ద కలదు – ఇక్కడ సతీదేవి శిరోజాలు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. ఐదవది జోగులాంబ దేవి ఆలయం – ఇది తెలంగాణలోని ఆలంపూర్ వద్ద ఉంది – ఇది కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగభద్ర’ & కృష్ణ నదులు కలిసే స్థలంలో ఉంది. ఇక్కడ అమ్మవారి పై పన్ను పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఆరవది భ్రమరాంబిక దేవి ఆలయం- ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వద్ద ఉంది – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉన్నారు. ఇక్కడ అమ్మవారి మెడ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఏడవది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం- ఇది మహారాష్ట్రలోని, కొల్హాపూర్ నగరంలో వద్ద ఉంది – ఈ ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అందుకే కొల్హాపూర్ ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. ఇక్కడ అమ్మవారి నేత్రాలు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి.

ఎనిమిదవది ఏకవీరిక దేవి ఆలయం- మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని పురాణాలు చెబుతున్నాయి. తొమ్మిదవది మహాకాళి ఆలయం – ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని వద్ద ఉంది – ఇదే ఒకప్పుడు అవంతీ నగరంగా పిలవబడేది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. ఇక్కడ సతీదేవి పై పెదవి పడిందని పురాణాలు చెబుతున్నాయి.పదవది పురుహూతిక దేవి ఆలయం – ఇది ఆంధ్రప్రదేశ్లోని పీఠిక్య లేదా పిఠాపురం నందు ఉంది – ఇక్కడ అమ్మవారు, కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్నారు. ఇక్కడ అమ్మవారి పీఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి.పదకొండవది గిరిజాదేవి ఆలయం – ఇది ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో వైతరిణీ నది తీరాన ఉంది. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి.పన్నిండవది మాణిక్యాంబ దేవి ఆలయం – ఇది ఆంధ్రప్రదేశ్లోని దక్షవాటిక లేదా ద్రాక్షారామం వద్ద ఉంది. ఇక్కడ అమ్మవారి కణతల భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి.పదమూడవది కామాఖ్యా దేవి ఆలయం – అస్సామ్ రాజధాని అయిన గౌహతి నుండి 18 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది తీరంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. పద్నాలుగవది మాధవేశ్వరి దేవి ఆలయం- ఇది ఉత్తరప్రదేశ్లోని, అలహాబాద్ ప్రాంతంలో త్రివేణీ సంగమం సమీపంలో ఉంది. ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి కుడి చేతి నాలుగు వేళ్ళు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. పదిహేనవది వైష్ణవి దేవి ఆలయం – ఇది హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వద్ద ఉంది – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఇక్కడ అమ్మవారి నాలుక పడిందని పురాణాలు చెబుతున్నాయి. పదహారవది మంగళ గౌరి ఆలయం – ఇది బీహారులోని పాట్నా నుండి 74 కిలోమీటర్ల దూరంలో గయ వద్ద ఉంది. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. అక్కడ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. పదిహేడవది విశాలాక్షి ఆలయం- ఇది ఉత్తరప్రదేశ్లోని వారాణసి వద్ద ఉంది. సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

పద్దెమ్మిదవది సరస్వతి దేవి ఆలయం – ఇది జమ్ము, కాశ్మీర్ వద్ద ఉంది – ఇక్కడ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ఇప్పుడు పిలవబడుతున్న ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

22,878FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles